చంద్రబాబుకి కోపం వచ్చింది! ఫలితంగా జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలేశారంటూ ప్రభుత్వంపై ఫైరవుతున్నారు. ప్రైవేటు హాసుపత్రుల్లో కరోనా బిల్లులు సామాన్యులు చెల్లించే పరిస్థితుల్లో ఉండటం లేదు.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ సూచనలు వంటివి చేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ…!!
ప్రజల బాధ్యత ప్రభుత్వానిదే అని బాబు అనుకోవడం మంచిదే కానీ… కేవలం ప్రభుత్వానిదే అనుకుంటే మరి ప్రతిపక్షాలు ఎందుకు.. రాజకీయంగా వారి భవిష్యత్తు ఏమిటి? తమ్ముళ్ల డౌట్! ప్రభుత్వం కరోనా విషయంలో ప్రజలను గాలికి వదిలేసిందా లేదా అన్నది ప్రజలకు తెలిసిన విషయం. రోడ్లపై బిక్షాటన చేసే వారికి సైతం కరోనా కిట్లు ఇచ్చిన క్రెడిట్ సొంతం చేసుకున్న జగన్ సర్కార్ సంగతి కాసేపు పక్కనపెడితే…!!
నిజంగా బాబు చెబుతున్నట్లు కరోనా విషయంలో జగన్ సర్కార్ ప్రజలను గాలికి వదిలేస్తే… ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష పార్టీలు ఏమి చేస్తున్నట్లు. ఆన్ లైన్ లో విమర్శలు చేస్తూ.. అనుకూల పత్రికల్లో బ్యానర్ ఐటంస్ వేయించుకుంటే సరిపోతుందా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకే తెలియాలి. బాబుకు గడిచిన ఎన్నికల్లో సీట్లు రాకపోవచ్చు కానీ… ఓట్ల శాతం బాగా వచ్చింది. మరి అంతమంది నమ్మకాన్ని బాబు ఏమి చేస్తున్నట్లు.
అంకెల్లో అధికారం కోల్పోయినా కూడా బాబుని నమ్మిన ప్రజలకు ఆయన ఇస్తోన్న భరోసా ఏమిటి? నిజంగా జగన్ సర్కార్ ప్రజలను గాలికి వదిలేస్తే బాబుకు ఇది రాజకీయంగా సువర్ణావకాశం. లేదు కేవలం రాజకీయ విమర్శల్లో భాగంగా ఈ మాటలు అన్నట్లుగానే జనం భావించాలనుకుంటే… జగన్ కరోనా విషయంలో ప్రజలను బాగానే చూసుకుంటున్నట్లన్నమాట!! ఈ లెక్కన ప్రజలను గాలికి వదిలేసింది ఎవరు?
-సి హెచ్. రాజా