ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలైన యువతిపై అదే ప్రాంతంలో ఉంటున్న దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని రాజుగా గుర్తించి.. అతడి కోసం గాలింపు చేపట్టారు. గంజాయి మత్తులో అతడు ఈ దాడి చేసినట్లు సమాచారం. అయితే, ఈ సంఘటనపై నారా చంద్రబాబు స్పందించారు. తాడేపల్లిలో సీఎం నివాసానికి కూతవేటు దూరంలో బాలిక హత్య షాక్ కు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కంటి చూపులేని బాలికను వేధించడమే కాకుండా…దారుణంగా హతమార్చడం దిగ్భాంతిని కలిగించిందన్నారు. సీఎం నివాస ప్రాంతంలో రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ల స్వైర విహారం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దుస్థితికి నిదర్శనమని తెలిపారు చంద్రబాబు.