ఏదైనా రాజకీయ వ్యూహం వేయడంలో మాజీ సీఎం చంద్రబాబును మించిన నాయకుడు మరొకరు లేరని అంటారు పరిశీలకులు. ఇప్పుడు కరోనా సమయంలోనూ ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. పార్టీ విషయాన్ని చర్చకు రాకుండా పరిస్థితిని చక్కబెడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విష యంలోకి వెళ్తే.. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో మధ్య తరగతి వారు తమకున్న బ్యాంకు బాలెన్సులు కరిగించో, అప్పులు తెచ్చుకొనో.. ఇల్లు గడుపుతున్నారు. కానీ, పేదల పరిస్థితి ఏంటి? అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజల పరిస్థితి ఏంటి?
అంటే.. ప్రభుత్వాలు కొంత మేరకు సాయం చేస్తున్నారు. నిత్యావసరాలు, నగదు కొంత మేరకు పంపిణీ చేస్తున్నారు. అయితే, ఎంత చేసినా.. ఎక్కడో కొరవ ఉండి పోతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దాతలు ముందుకు వచ్చారు. పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చాయి. ఇక, అధికార పార్టీ వైసీపీ కూడా రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టింది. అయితే, ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కూడా తనవంతు బాధ్యతను నెరవేర్చే ప్రయత్నం చేసింది. ఒక నెల వేతనాన్ని ఎమ్మెల్యేలు ఇస్తారని బాబు ప్రకటించారు. అయితే, కరోనా లాక్‌డౌన్ సమస్య నిత్యం పొడిగిస్తుండడంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
ఈ క్రమంలో ప్రజలు రాజకీయ నేతల నుంచి సాయం కోరుతున్నారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఈ సమయంలో ముందుకు వచ్చి ప్రజలకు సాయం చేస్తారని అందరూ భావించారు. కానీ, దీనికి విరుద్ధంగా నిన్నగాకమొన్న వైసీపీతరఫున గెలిచిన నాయకులు, యువ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి ప్రజలకు అండగా నిలుస్తున్నారు., దీంతో టీడీపీపై సహజంగానే ఒత్తిడి పెరిగింది. ఐదేళ్లు అధికారంలో ఉండి వెనుకేసుకున్నారు. ఆమాత్రం ఇప్పుడు సాయం చేయలేరా? అంటూ విమర్శలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు.
మరి ఈ నేపథ్యంలో టీడీపీ అధినేతగా చంద్రబాబు ఏం చేయాలి? తన పార్టీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పిలుపు నివ్వాలి. ఆయన అదే చేశారు. అయితే, వారే స్పందించలేదు. దీంతో ఎక్కడా కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఒకవైపు వైసీపీ నేతలు దూకుడుగా ఉండడం, మరోవైపు టీడీపీ నాయకులు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో తమ కు సంబంధించిన లోపాలు ప్రధాన మీడియాలో రాకుండా జాగ్రత్త పడేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న సాయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చేలా.. వారుచేసిన సాయాన్ని తప్పు బట్టేలా.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని టీడీపీ సర్కిళ్లలోనే హల్‌చల్ చేస్తున్నాయి.