అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేఖలో చంద్రబాబు కోరారు. బకాయిల ఆలస్యంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటిన విషయాన్ని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. రైతులు తీసుకున్న అప్పులకు వడ్డీలు ఎవరు కడతారని, ఖరీఫ్ పెట్టుబడులు ఎవరిస్తారని ప్రశ్నించారు.
ఈ -క్రాఫ్‌లో పేరు నమోదు అంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ, మిల్లర్లు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. పంటకు మద్దతు ధర కల్పంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాయలసీమలో వేరు శనగ పంట నష్టపోయినా పెట్టుబడి రాయితీ ఇప్పటివరకు చెల్లించలేదని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో 48 గంటల్లో రైతులను నగదు జమ చేసినట్లు చంద్రబాబు గుర్తుచేశారు.