ఏపీలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో సీఎం జగన్‌ని పక్కనబెడితే 150. అలాగే 25 మంత్రులని కూడా తీసేస్తే 125 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. టీడీపీ-జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యేలని కూడా కలుపుకుంటే 130 మంది అవుతారు. అయితే ఈ 130 మంది ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనబరుస్తూ, వారి వారి నియోజకవర్గాల్లో దూసుకెళుతున్నారా? అంటే చెప్పడం చాలా కష్టం.
ఇందులో పలువురు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడం లేదనే తెలుస్తోంది. కేవలం వారు జగన్ ఇమేజ్ మీద ఆధారపడి బండి లాగిస్తున్నారని చెప్పొచ్చు. అసలు గత ఎన్నికల్లోనే చాలామంది ఎమ్మెల్యేలు కేవలం జగన్ ఇమేజ్ మీద, చంద్రబాబు మీద వ్యతిరేకితతో భారీ మెజారిటీలతో గెలిచేశారు. అలా గెలిచిన ఎమ్మెల్యేలు తర్వాత, సొంతంగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది.
ఇప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. అలాగే ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కొందరు వెనుకబడే ఉన్నారని తెలుస్తోంది. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు స్థానికంగా పలు వివాదాల్లో కూడా చిక్కుకుని ఉంటున్నారు. అయితే ఇలా పలువురు ఎమ్మెల్యేలపై నెగిటివ్ ఉన్నా సరే, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి ఇంకా స్ట్రాంగ్ ఉండటానికి ప్రధాన కారణం జగన్ ఇమేజ్ అని చెప్పొచ్చు. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేలకు బాగా ప్లస్ అవుతున్నాయి.
ప్రభుత్వం నుంచి ఏం వచ్చిన అది జగనే ఇచ్చారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పథకాల డబ్బులు అకౌంట్‌లో పడితే చాలు…అవి జగనే వేశారని చెబుతున్నారు. ఇలా ప్రజలు ఎమ్మెల్యేలని కాకుండా జగన్‌ని చూడటం వల్లే, వైసీపీ బలం ఏ మాత్రం తగ్గకుండా ఉంది. అదే సమయంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కూడా పుంజుకోలేదు. ఇక ఇలాంటి కారణాలు వైసీపీ ఎమ్మెల్యేలకు బాగా ప్లస్ అవుతున్నాయి. ఏదేమైనా జగన్ ఇమేజ్ మీద చాలామంది ఎమ్మెల్యేలు ఆధారపడి ఉన్నారు.