జగన్‌కు బాబు సపోర్ట్ ఉంటుందా?  

-

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు సపోర్ట్ ఉంటుందా? అంటే అసలు ఈ ప్రశ్నే ఉండదని చెప్పొచ్చు. జగన్‌కు బాబు సపోర్ట్ ఇవ్వడం కలలో కూడా జరగదు. అలాగే బాబు సలహాలు జగన్ తీసుకోవడం కూడా జరగని పని. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. నిత్యం ఏదొక అంశంపై జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బాబు చూస్తూనే ఉన్నారు.

ఏపీలో ఇలాంటి పరిస్తితులు ఉన్న నేపథ్యంలో పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంతో జరుగుతున్న నీటి యుద్ధంలో బాబు, జగన్‌కు సపోర్ట్‌గా ఉండటం కష్టమే. కృష్ణా నది పైన ఏపీ ప్రభుత్వం నిర్మించే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుని, ఆర్డీఎస్‌ కుడికాల్వని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వీటిని అక్రమంగా నిర్మించి, నీటిని తరలించుకుపోవాలని ఏపీ ప్రభుత్వం చూస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అవుతుంది.

ఈ ప్రాజెక్టులని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తుంది. అయితే నిబంధనలకు లోబడే సక్రమంగానే ఈ ప్రాజెక్టులని కడుతున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇలా తెలంగాణ వర్సెస్ ఏపీ మాదిరిగా చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. ఇరు రాష్ట్రాల నేతలు సైతం మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ప్రతిపక్షం నేతగా ఉన్న చంద్రబాబు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు నిత్యం తెలంగాణ ప్రభుత్వంతో కయ్యం పెట్టుకునే వారు.

కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళాక కేసీఆర్ ప్రభుత్వం గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. ఇప్పుడు రాయలసీమ ప్రజల కోసం కడుతున్న ఎత్తిపోతల పథకానికి కూడా సపోర్ట్‌గా మాట్లాడటం లేదు. అంటే ఈ నీటి వ్యవహారంలో బాబు జోక్యం చేసుకోకుండా సైలెంట్‌గా ఉండేలా కనిపిస్తున్నారు. కాబట్టి జగన్ ప్రభుత్వానికి మద్ధతుగా బాబు, కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడటం కష్టం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version