నేను మోనార్క్‌ను. నన్ను మించిన నాయకుడు, నన్ను మించిన వ్యూహకర్త ఎవరైనా ఉన్నారా ? మోడీ కూడా నాకన్న సీనియర్ కాదు. దేశంలో నాతో సరితూగగల నాయకుడు లేరంటూ.. గడిచిన తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనిని మెప్పుకోసం చెప్పుకొన్నారో.. లేక అహకారంతో చెప్పుకొన్నారో.. లేక జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పగలననే ధీమాతో అనుకున్నారో.. తెలియదు కానీ.. ఈ నేపథ్యంలోనే ఆయన తన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్రానికి చెప్పలేదు. నేను నిర్ణయం తీసుకున్నాక ఇక, దానిలో తప్పేముంటుంది? ఎవరు మాత్రం వేలు పెట్టగలరు..?
ఎవరు మాత్రం కాదనగలరు? అనుకున్నారేమో.. ఏమో చంద్రబాబు..తెలియదు కానీ.. రెండు ప్రధాన విషయాల్లో ఆయన కేంద్రాన్ని సంప్రదించకుండా వ్యవహరించారు. అవే.. రాజధాని అమరావతి ఏర్పాటు. రెండు.. సీఆర్డీఏ చట్టం. ఈ రెండు విషయాల్లోనూ ఆయన తన సొంత బుద్ధిని వియోగించి ఏర్పాటు చేశారనేది వాస్తవం. అయితే, ఎంత తన నేతృత్వంలో ఏర్పాటు చేసినా.. కేంద్రంతోనూ ఒక్కమాట చెప్పి.. పార్లమెంటులోనూ వీటిని ఆమోదం పొంది ఉంటే.. కొంత మేరకు వాటికి బలం ఉండేది. కేంద్రం కూడా `ఔను` అవి మాకు చెప్పే చేశారు. మేం వాటికి ఆమోదించాం! అని చెప్పి ఉండేది. అంటే.. చంద్రబాబు తనపై తాను అతి నమ్మకంతో ముందుకు వెళ్లారు.
ఎవరు తనను ప్రశ్నిస్తారనే వాదన ఒకటైతే.. రెండో సారి కూడా తానే అధికారంలోకి వస్తాననే ధీమా. ఆయనకు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ రెండు విషయాలపై కూడా ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఈ రెండు నిర్ణయాలను తిరగదోడింది. అమరావతిని వికేంద్రీకరిస్తూ.. నిర్ణయించింది. అదే సమయంలో ఏకంగా సీఆర్ డీఏను రద్దు చేస్తూ ప్రతిపాదించింది. గెజిట్ నోటిఫికేషన్ కూడావిడుదల చేసింది. అయితే, దీనిపై హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా న్యాయస్థానం.. కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అసలు అమరావతిపైనా, సీఆర్ డీఏపైనా మీ నిర్ణయం ఏంటి? మీకు తెలిసి ఇవి జరగలేదా? అని ప్రశ్నించింది. తాజాగా వీటిపై మరోసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిలో అమరావతి అనేది రాష్ట్ర ప్రభుత్వ పరధిలోని విషయమని మరోసారి స్పష్టం చేసింది. దీనిపై చంద్రబాబు తమకు చెప్పలేదని పేర్కొంది. అదే సమయంలో సీఆర్ డీఏ చట్టం విషయంపై కూడా బాబు తమతో చర్చించలేదని తెలిపింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయాలు తీసుకున్నా.. తమతో చర్చించలేదని పేర్కొంది. దీంతో బాబు చేసిన పాపాలు.. ఆయనకు శాపాలుగా మారి.. ఈ విషయంలో కేంద్రం అడ్డుపడుతుందని భావించినా.. చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది.