ఏ ఎండకు ఆ గోడుగు పట్టడం అనే సామెతను టీడీపీ అధినేత చంద్రబాబు బాగా ఒంట పట్టించుకున్నారని అంటున్నారు విశ్లేషకులు. ప్రజల్లో సెంటిమెంటును రెచ్చగొట్టడంలో చంద్రబాబును మించిన నాయకుడు మరొకరు లేరని అంటున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అనేక రూపాల్లో సెంటిమెం టును తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన ప్రయత్నాలు అప్పట్లో వికటించాయి. అయితే, ఇప్పటికీ ఆయనలో మార్పు రావడం లేదు. ప్రస్తుతం రాజధాని అమరావతిని అడ్డు పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేందుకు తన ప్రయత్నం తాను చేస్తున్నారు.
రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, రాజకీయ పార్టీలు మాత్రం నవ్విపోయినా సిగ్గులేదని అన్న ట్టుగా.. ఆలు లేదు చూలూ లేదు.. అనే సామెతను నిజం చేస్తూ.. ఉద్యమాలకు రెడీ అయ్యాయి. రాజధాని గ్రామాల్లో నిరాహార దీక్షలు, ఆందోళలను, నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని దానిపై ప్రకటన చేసిన తర్వాత ఇలాంటి చేపడితే.. మంచి బూమ్ వచ్చేది. కానీ, ఇప్పటి వరకు ప్రబుత్వం ఎలాంటి ప్రకటనా చేయకుండానే ఎందుకు ఇలా ఆందోళనలు చేస్తున్నారనే విషయం చర్చనీయాంశంగామారింది.
ఇవన్నీ ఇలా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఏకం గా జోలెపట్టి డబ్బులు సేకరించారు. ఆయన చేసిన బహిరంగ ప్రకటన ప్రకారమే.. మూడు లక్షల పైచిలు కు నిధులు అప్పటికప్పుడు పోగయ్యాయి. అయితే, ఇలా జోలెపట్టి మరీ చంద్రబాబు రోడ్లపై ఎందుకు వచ్చారనే విషయం చర్చగా మారింది.వాస్తవానికి జోలె ఎప్పుడు పడతారు? ఎందుకు పడతారు? అనేది కూడా ప్రస్థావనకు వస్తున్న విషయం. ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తేనో.. లేక ప్రపంచ యుద్ధాలు వచ్చి దేశంలో కరువు కాటకాలు వస్తేనో.. ప్రజలకు తిండి, నీరు అందించేందుకు ప్రబుత్వాల దగ్గర సరైన నిదులు లేనప్పుడు ఇలా జోలె పట్టడం అనేది ఉంటుంది.
గతంలోనూ ఇలాంటి సమయాల్లోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహామహులు జోలెపట్టారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు అకస్మాత్తుగా జోలె పట్టుకుని రోడ్లమీద తిరగడం ఆసక్తిగా మారింది. రాజధానిపై ఒక్క చంద్రబాబుకు మాత్రమే ప్రేమ ఉన్నట్టుగా .. మిగిలిన వారికి లేనట్టుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ఎబ్బెట్టుగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. రాజధాని ఉద్యమానికి ప్రజలను సమాయత్తం చేయడం వరకు బాగానే ఉంటుంది. కానీ, ఇలా జోలె పట్టిన డబ్బులు ఎవరికి ఇస్తారు? ఇలానే రాజధాని కోసం చందాలు వసూలు చేశారు గత ప్రభుత్వంలో ఉండగా.. ఆ నిధులకు ఇప్పటికీ లెక్కలు లేవు. మరి ఇప్పుడు కూడా ఇంతేనా? అనే ప్రశ్న వస్తోంది. ఏదేమైనా .. చంద్రబాబు తీరు విమర్శలకు తావిస్తోంది.