విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రతిపక్షనాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర .. అనేక మలుపులు తిరిగింది. ఈ ఒక్క పర్యటన అనేక పాఠాలు చెప్పింది. ఒకింత ఆశ్చర్యం గా అనిపించినా.. బాబు పర్యటన ఖరారు కావడంతోనే ఈ పర్యవసానాలను ఓ వర్గం ప్రజలు, విశ్లేషకులు ముందుగానే ఊహించారు. విశాఖలో భూదందా సాగుతోందని, చెరువులను స్వాధీనం చేసుకుని పేదలకు ఆవాసాలుగా పంచేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వీటిని ఏకరువు పెట్టి ప్రజల్లో చైతన్యం కల్పించాలని చంద్రబాబు ప్రకటించారు.
ఇదే లక్ష్యంగా తాను అక్కడ పర్యటిస్తున్నానని ఓ నోట్‌లో రెండు రోజుల కిందటే ప్రకటించారు. అయితే, వాస్తవానికి చంద్రబాబు వ్యూహం ఇది కాదనేది రాజకీయ నేతలకు అందరికీ తెలిసిన విషయమే! నాలుగు రోజుల కిందట ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి నోటి నుంచి ఓ వ్యాఖ్య వచ్చింది. అమరా వతిలో ఇంత హడావుడి చేస్తున్న చంద్రబాబు.. ఉత్తరాంధ్రలో పర్యటించి మీకు రాజధాని ఇక్కడ వద్దు! అని చెప్పగలరా? ముఖ్యంగా విశాఖలో ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దనే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.
ఆ వెంటనే చంద్రబాబు ఈ పర్యటనను తెరమీదికి తెచ్చారు. అంటే.. పైకి బాబు చెప్పినట్టు అక్కడ భూ దం దాలు, చెరువుల ఆక్రమణలపై పేరు నామమాత్రమే. ఆయన ఉద్దేశం మాత్రం రాజధాని విషయంలో జగన్‌ను టార్గెట్ చేయడమే అనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ నేపథ్యంలోనే సహజంగానే అధికార పార్టీ దీనిని అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక వేసుకుంటుందని చంద్రబాబుకు కూడా తెలుసు. ఈ క్రమంలోనే పోలీసులు అసలు పర్మిషన్ ఇవ్వరని(ప్రభుత్వం) అని అనుకున్నారు. కానీ, జగన్ వ్యూహాత్మ కంగా వ్యవహరించి పర్మిషన్ ఇచ్చారు.
అయితే, స్థానికంగా ఉండే ప్రజల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనగానే కొంత ఆశ పుట్టడం సహజం. మరి దీనిని అడ్డుకుంటున్న చంద్రబాబు ఇక్కడకు వస్తున్నారని తెలియడంతో విశాఖ ప్రజల్లో సహజంగానే ఆగ్రహం పెల్లుబికింది. దీనికి వైసీపీ కూడా తోడైంది. దీంతో ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు సహజంగానే కారణం దొరికినట్టయింది. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ రగడ.. సాయంత్ర 5 గంటలకు వరకు కూడా కొనసాగింది. గతంలో జగన్ విశాఖలో పర్యటించేందుకు అనుమతి కూడా ఇవ్వని చంద్రబాబును టార్గట్ చేసేందుకు ఇది చక్కని అవకాశంగా వైసీపీ భావించడంలో రాజకీయ కోణాన్ని ఎవరూ తప్పుపట్టరు.
అదేసమయంలో విశాఖలో అసలు రాజధాని ఊసే లేదని చెప్పుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నం కూడా రాజకీయ కోణమే కాబట్టి దీనిని కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు(ఎవరి వెర్షన్ వారిది) అయితే, ఈ మధ్యలో నలిగిపోయింది మాత్రం పోలీసు శాఖే! తాను 15 ఏళ్ల అనుభవం ఉన్న సీఎంనని, పాతికేళ్ల అనుభవం ఉన్న పార్టీకి అధ్యక్షుడినని, పదకొండేళ్ల సీనియార్టీ ఉన్న ప్రతిపక్ష నాయకుడినని బోరు మన్నా.. నిబందనలను చంద్రబాబు తోసిపుచ్చలేక పోయారు. తాను ఎంచుకున్న అజెండా ఒకటి.. పైకి చెప్పిన అజెండా మరొకటి కావడంతో ఆయన ఫెయిలయ్యారనే అనాలి.
చివరాఖరుకు: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య పంతంతో కూడిన రాజకీయాలు సాగుతున్నాయన డంలో నేడు జరిగిన ఘటన అత్యంత పరాకాష్టకు చేరిందనేది విశ్లేషకులు భావన. అంత అనుభవం ఉందని చెప్పుకొంటున్న చంద్రబాబుకానీ, 30 ఏళ్లపాటు అధికారంలో ఉండాలని భావిస్తున్న జగన్ కానీ పంతాలకు పోవడం వల్ల ఇలాంటి పరిస్థితులే వస్తాయని అనడంలోనూ సందేహం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాజకీయాలకు బదులుగా న్యాయ వ్యవస్థే పాలన సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుండడం ముదావహం ఎంతమాత్రమూ కాదనేది విశ్లేషకుల భావన. ఈ క్రమంలో ఇరు పక్షాలు కూడా కొంత తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. కానీ, ఆ పరిస్థితి ఇప్పుడు ఉంటుందా? ఇకపై కనిపిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న!!