కుప్పంలో రెండవరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కోలాహలంగాకొనసాగింది. ఉదయం నుండి ఇతర పార్టీల నుండి చేరికలు, తెదేపా శ్రేణులతో సమీక్షాలు, బహిరంగ సభలో పాల్గొని ప్రసంగం చేశారు. బీసీఎన్ కల్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. సురేష్ బాబు, అతని అనుచరులు టీడీపీలో కండువా కప్పుకొన్నారు. ఇదే సభలో వైసీపీ, ఇతర పార్టీల నుండి వందలాది మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు.
సంపద సృష్టించటం ఆ సంపదను పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీ అని వెల్లడించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, జనతా వస్త్రాలు వంటి సంక్షేమ పధకాలకు నాంది పలికిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. “ఐటీనీ అందిపుచ్చుకుని సంపద సృష్టించాం. కానీ, వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారు. నీతి నిజాయతీకి మారు పేరు కుప్పం ప్రజలు, నేడు ఇక్కడ రౌడీలు పేట్రేగిపోతున్నారు, నా దగ్గర మీ రౌడీయిజం చెల్లదు. తీవ్ర వాదులపై పోరాడిన పార్టీ, రౌడీలను తుదముట్టించిన పార్టీ టీడీపీ. కుప్పంలో వైసీపీ గూండాలు బహిరంగంగా ఒక వ్యక్తిపై దాడులు చేయటం ఓ వీడియోలో చూసి చలించిపోయా, అసలు వీళ్లు మనుషులా రాక్షసులా? అనిపించింది.
పేదలను ధనికుల్ని చేసే బాధ్యత తీసుకుంటాం. నాడు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ లు ఇచ్చాం. కాలేజీ సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి మగవారితో సమానంగా ప్రోత్సహించాం అని అన్నారు చంద్రబాబు.