Breaking : ఈ రోజు సీజేఐగా ప్రమాణం చేయనున్న జస్టిస్‌ చంద్రచూడ్‌

-

జస్టిస్‌ ధనంజయ యశ్వంత్‌ (డీవై) చంద్రచూడ్‌ బుధవారం భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చంద్రచూడ్‌తో పదవీప్రమాణం చేయిస్తారు. ఆయన తండ్రి యశ్వంత్‌ విష్ణు (వైవీ) చంద్రచూడ్‌ కూడా ప్రధాన న్యాయమూర్తిగా దీర్ఘకాలం పనిచేయడం విశేషం. తండ్రీకుమారులిద్దరూ సీజేఐ లుగా పనిచేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. బుధవారం బాధ్యతలు చేపట్టే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 2024 నవంబరు 10న పదవీవిరమణ చేస్తారు. ఇంతవరకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగిన జస్టిస్‌ యూయూ లలిత్‌ మంగళవారం పదవీవిరమణ చేయాల్సి ఉంది. కానీ మంగళవారం సెలవు కావడంతో సోమవారమే ఆయన వైదొలిగారు.

వివిధ రాజ్యాంగ ధర్మాసనాల్లో పాలుపంచుకున్న జస్టిస్‌ చంద్రచూడ్‌ అయోధ్య వివాదం, గోప్యత హక్కు, వ్యభిచారం, ఆధార్‌ చట్టబద్ధత, శబరిమల మొదలైన కీలక అంశాలపై చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఐపీసీ సెక్షన్‌ 377లోని ఓ భాగాన్ని కొట్టివేశారు. వివాహితలు, అవివాహితలు అన్న భేదం లేకుండా మహిళలందరికీ అబార్షన్‌ హక్కు ఉందని ఇటీవలే మరో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. సుప్రీంకోర్టు కార్యకలాపాల డిజిటైజేషన్‌కు కూడా నడుం బిగించారు. కోర్టు విచారణ ప్రక్రియను కాగితరహితంగా మార్చేందుకు కృషిచేస్తున్నారు. ఉదారవాదిగా పేరుగాంచిన ఆయన చట్టనిబంధనలను, సంప్రదాయాలను సంపూర్ణంగా పాటిస్తారు. ఇటీవల సుప్రీంకోర్టులో జడ్జీల నియామకంపై కొలీజియంలోని నలుగురు న్యాయమూర్తులతో చర్చించకుండా చీఫ్‌ జస్టిస్‌ లలిత్‌ వారందరికీ సదరు ఫైలు పంపారు. ఇలా ఫైలును సర్క్యులేట్‌ చేయడాన్ని వ్యతిరేకించిన ఇద్దరు న్యాయమూర్తుల్లో జస్టిస్‌ చంద్రచూడ్‌ ఒకరు. న్యాయమూర్తుల నియామకంపై కొలీజియంలోని ఐదుగురు సభ్యులూ కచ్చితంగా ముఖతా చర్చించాల్సిందేనని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version