రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో ఏజెంట్ చీకోటి ప్రవీణ్ పై ఈడీ దాడులు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు చీకోటి కస్టమర్స్ గా ఉన్నారనే కథనాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ఈడీ..చీకోటిని విచారిస్తూ ఉంది. తాజాగా కూడా విచారణ చేయగా, పలు అంశాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చీకోటి అసలు వ్యవహారం క్యాసినో కాదని, దాని వెనుక హవాలా వ్యాపారం ఉందని ఈడీ అనుమానిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో క్యాసినో హవాలా లావాదేవీల వెనక వరంగల్ కేంద్రంగా ఓ చిట్‌ఫండ్ కంపెనీ ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఆ చిట్‌ఫండ్ కంపెనీ ద్వారానే చీకోటి ప్రవీణ్ హవాలా మార్గంలో దుబాయ్, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాలకు డబ్బును పంపించినట్లుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే చీకోటి వ్యవహారంలో ఉన్న రాజకీయ ప్రముఖులు ఎవరు అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇప్పటికే పలువురు పేర్లు బయటకొచ్చాయి. కానీ వారు తమకు సంబంధం లేదని మాట్లాడేస్తున్నారు. తాజాగా చిట్‌ఫండ్ కంపెనీ బయటపడగా, ఆ కంపెనీ ఓనర్ వచ్చి…ఓ మాజీ ఎమ్మెల్యే అని తేలింది. అయితే చీకోటి విషయంలో ఈడీ వేగంగా విచారణ చేస్తుంది…అలాగే ఇందులో ఉన్న చీకటి కోణాన్ని బయటపెట్టడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో తాజాగా చీకోటి పేరుతో వచ్చిన ఓ ట్వీట్..రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేసింది. ‘‘నన్ను బలిపశువును చేయాలని చూస్తే.. నాచేత ఈ పనులు చేయించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. సీఎం అయినా, మంత్రులైన అందరికీ ఒకే న్యాయం’’ అని ఉన్న ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇది చీకోటి పేరు మీద వచ్చిన నకిలీ ట్వీట్ అని తెలుస్తోంది…నకిలీ ట్వీట్ అయినా సరే…ఎప్పుడు ఎవరి పేరు బయటకొస్తుందా అని రాజకీయ నేతలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చీకోటి…రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయకులని షేక్ చేస్తున్నారు.