ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై నిరసనల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఓ ముస్లిం యువకుడు నుపుర్ శర్మకు మద్దతుగా నిలువడంతో అతడిపి దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. భివాండీలో ఈ ఘటన జరిగింది. అతడి పేరు సాద్ అన్సారీ. నుపుర్ శర్మకు సంఘీభావం ప్రకటించడమే కాదు, ఆమెను ధైర్యశాలి అయిన మహిళగా అభివర్ణించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే, ఇతర ముస్లింల నుంచి అతడికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
పెద్ద సంఖ్యలో ముస్లింలు అతడి ఇంటిని ముట్టడించారు. పోస్టులు తొలగించడమే కాకుండా, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆపై ఆ యువకుడిపై దాడికి దిగారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో అక్కడికి వచ్చిన పోలీసులు బాధిత యువకుడ్ని అరెస్ట్ చేశారు. రెండు గ్రూపుల మధ్య మత ప్రాతిపదికన విద్వేషాలు రగిల్చేందుకు ప్రయత్నించాడంటూ అతడిపై ఐపీసీ 153 (ఏ) కింద అభియోగాలు మోపారు పోలీసులు.