ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై కాస్త సీరియస్ గా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలో ఉద్యోగుల విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళింది. దీంతో అక్కడి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వెనకడుగు వేయలేదు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు మాత్రం ఇప్పుడు తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా సీఎం జగన్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.
బడ్జెట్ సమావేశాల్లో దీనిపై జగన్ ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశాలు ఉండవచ్చన్న అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలతో వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వచ్చేవారం ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరుకానున్నారు. అలాగే పలు జిల్లాల కలెక్టర్లు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. పదోన్నతుల విషయంలో రాష్ట్రంలో ఇబ్బందుల నేపథ్యంలో వాటిని పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారు.