ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కాదని విశాఖకు పరిపాలనా రాజధాని, కర్నూలుకి హైకోర్ట్ తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రాజకీయంగా ఈ అంశం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అటు అమరావతి ప్రాంత రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర స్థాయిలో అమరావతి ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారు.
అయినా సరే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. ఇప్పుడు ఆయన కేంద్రం మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రాజధాని ఆలోచనను కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని భావిస్తున్నారు జగన్. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం కావడానికి అయన ఢిల్లీ వెళ్ళే ఆలోచన చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాను కలవడానికి అపాయింట్మెంట్ కి కూడా ప్రయత్నాలు చేసారు.
అయితే ఇద్దరూ ఇప్పుడు జగన్ కి షాక్ ఇస్తారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. రాజధాని విషయంలో రాష్ట్ర బిజెపి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంది. పొత్తు పెట్టుకున్న జనసేన కూడా జగన్ నిర్ణయానికి అభ్యంతరం తెలుపుతుంది. ఈ తరుణంలో రాజధానిని మార్చడానికి జగన్ కి అంగీకారం తెలిపితే అది రాష్ట్రంలో బిజెపికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే బిజెపి, జనసేన పోరాటానికి సిద్దమవుతున్నాయి.
వాస్తవానికి రాష్ట్ర రాజధాని అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. దీనికి కేంద్రం మద్దతు అవసరం లేదు. బిజెపితో జగన్ సన్నిహితంగా ఉంటున్నారు, దానికి తోడు కొన్ని కారణాల వలన ఆయన బిజెపిని విభేదించే పరిస్థితి ఎంత మాత్రం లేదు. అందుకే కేంద్ర పెద్దల మద్దతు అనేది అవసరమైంది. మరి జగన్ మాట వాళ్ళు వింటారా లేదా అనేది చూడాలి. కేంద్రానికి వివరించిన తర్వాతే కేబినేట్ మీటింగ్ ఉండే అవకాశం ఉంది.