నేడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. వైయస్సార్ కృషితోనే గండికోట ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు జగన్.
గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. 550 కోట్లతో బ్రహ్మసాగర్ లైనింగ్ పనులు చేపట్టామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో స్టీల్ ప్లాంట్ కడతామని హామీ ఇచ్చారని.. విభజన చట్ట హామీలను గత పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. జనవరి నెలాఖరులో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడతాయి అన్నారు. రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలన్నారు సీఎం జగన్.
చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్ర మనో.. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని నేను అనట్లేదు అన్నారు. అలాగే చంద్రబాబుతో కలిసి ఉన్న దత్తపుత్రుడు మాదిరిగాయి భార్య కాకపోతే మరో భార్య అని కూడా నేను అనట్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడే నా రాజకీయం, ఇదే నా రాజకీయ విధానం” అని స్పష్టం చేశారు సీఎం జగన్.