ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు విషయంలో సోమవారం ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా ఉంది. రాజధాని తరలింపు పై సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం మాత్రం కనబడటంలేదు. రాజధాని మార్పు అంశంపై జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు దృష్టిలో ఉంచుకుని జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో ఎటువంటి ఆందోళనలు జరగకుండా పోలీసు అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలు దృష్టిలో ఉంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక బలగాలను మోహరిస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ అధికారుల సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో, ఈ నెల 20న క్యాబినెట్ సమావేశం తో పాటు మూడు రోజుల పాటు జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు భద్రతపై ప్రధానంగా అధికారులు చర్చించారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు.
ఇదిలా ఉండగా మరికొన్ని బలగాలను రంగంలోకి దింపే అవకాశం ఉందని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఏయే ప్రాంతాల్లో ఆందోళన ఎక్కువగా జరుగుతాయి, ఎక్కడ ఏ ఆంక్షలు విధించాలని దాని పై అధికారులు కీలకంగా చర్చించినట్టు సమాచారం. జగన్ నుంచి అధికారులు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో తెలుగుదేశం నేతల మీద ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలని అధికారులు ఆదేశించారట. రైతులను రెచ్చగొట్టే అవకాశం ఉందని భావిస్తున్నారట.