రైతులకు గుడ్‌ న్యూస్‌.. పోలవరంపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

-

2025 ఆగస్ట్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పర్యటించారు. వరద బాధితులను సీఎం జగన్‌ పరామర్శించారు. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. గొమ్ముగూడెంకు చెందిన వరద ముంపు బాధితులతో సమావేశంలో పాల్గొని సీఎం జగన్‌ మాట్లాడారు.

గత ప్రభుత్వాల కంటే భిన్నంగా వరద బాధితులను ఆదుకుంటున్నామని.. వరదలతో ఇళ్లు దెబ్బతింటే సాయం అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఏ ఒక్కరూ సాయం అందలేదనకూడదన్నారు. సహాయక చర్యల్లో కలెక్టర్లకు అన్ని రకాల అధికారాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. వరద బాధితులకు సాయం అందకుంటే ఫిర్యాదు చేయొచన్నారు. పోలవరం డ్యాంలో మూడు దశల్లో నీళ్లు నింపుతామని.. ఒక్కసారిగా నింపితే డ్యామ్‌ కూలిపోవచ్చని సీఎం చెప్పుకొచ్చారు. సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతామని.. కమిషన్‌ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తున్నామన్నారు.

ఆర్‌ అండ్‌ ఆర్‌ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు అందిస్తామని.. ఆర్‌ ఆండ్‌ ఆర్‌ ప్యాకేజీ కోసం కేంద్రం ఒత్తిడి తెస్తున్నామన్నారు సీఎం జగన్. జనవరి కల్లా ప్యాకేజీ అందే విధంగా చూస్తామన్నారు. 2025 ఖరీఫ్‌ నాటికి పోలవరం పూర్తి చేసి నీరందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే 6,7 నెలల్లో మీకు రావాల్సిన ప్యాకేజీపై మంచి జరుగుతుందన్నారు. ఐదు లక్షల ప్యాకేజీలో ఒకటిన్నర లక్షలు ఇచ్చామని.. మిగిలిన రూ. 3.50 లక్షలు త్వరలో ఇస్తామన్నారు. అందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. లిడార్‌ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. లిడార్‌ సర్వే సైంటిఫిక్‌గా జరిగింది.. ఎవరికీ అన్యాయం జరగదన్నారు. భూములు కొనుగోలుకు సంబంధించి మరింత న్యాయం చేస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Read more RELATED
Recommended to you

Exit mobile version