కయ్యానికి కాలుదువ్విన ముగ్గురు అధికారులకు చుక్కలు చూపిస్తున్న జగన్

-

ఏపీలో పరిపాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు సీఎం జగన్‌. పరిపాలనా యంత్రాంగం మీద పట్టు బిగించే దిశగా రకరకాల కొత్త విధానాలను.. ఆవిష్కరణలను తెర మీదకు తెస్తున్నారు. సంక్షేమంపై ఫోకస్‌ పెట్టడం సరైన విధానంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా రుజువైనట్టు చెబుతున్నారు. ఇక కొందరు అధికారులు తమ వైఖరితో ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలన్ని చూస్తుండటంతో వారికి అదే స్థాయిలో అస్త్రాలను బయటకు తీసి చుక్కలు చూపిస్తుంది జగన్ సర్కార్.


జగన్‌ సర్కార్‌ కొలువు తీరాక సర్కార్ ని ఇరాకటంలో పెట్టారు కొందరు అధికారులు. ఎల్వీ సుబ్రమణ్యం, ఆ తర్వాత మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, ఇప్పుడు సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావుల గురించి ప్రస్తావిస్తున్నారట. మిగిలిన ఇద్దరితో పోలిస్తే ఎల్వీ సుబ్రమణ్యం ప్రభుత్వంతో నేరుగా జగడం పెట్టుకోలేదు. అక్కడా..ఇక్కడా ప్రభుత్వం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు ప్రభుత్వానికి నాడు సమాచారం అందింది. దాంతో సీఎస్‌గా ఉన్న ఎల్వీని ఆ పోస్టు నుంచి తప్పించి హెచ్ఆర్డీలో పోస్టింగ్ ఇచ్చి ఎల్వీని లైమ్ లైట్ లో లేకుండా చేశారు. ఎల్వీ వ్యవహారం ముగిశాక ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారం రచ్చ రచ్చ అయింది.


నిమ్మగడ్డకు ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే సాగింది. ప్రభుత్వం ఇరుకున పడుతుందేమోనని సందేహించినా..సీఎం జగన్‌ సహా మంత్రులు.. వైసీపీ నేతలు రమేష్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రమేష్‌ ఎత్తులకు పైఎత్తులు వేయడం ద్వారా పట్టు బిగించారు అధికారపార్టీ నేతలు. ఈ వివాదంలో ఎక్కడా తగ్గేది లేదన్నట్టుగా జగన్ వైఖరి సాగింది. వైసీపీ సర్కార్‌ను ఎంతగా ఇబ్బంది పెట్టాలని మాజీ ఎస్‌ఈసీ భావించినా. సక్సెస్‌ కాలేకపోయారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతుంటాయి. ఇప్పుడు ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంతు వచ్చింది.

చాలా కాలం తర్వాత ఆయన వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు. నిఘా పరికరాల కొనుగోళ్లల్లో అక్రమాలు జరిగాయనే అంశంపై కమిషనరాఫ్‌ ఎంక్వైరీస్‌ విచారణ మొదలు పెట్టినప్పటి నుంచి ఏబీ యాక్టీవ్‌ అయ్యారు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారిని నేరుగానే టార్గెట్ చేస్తున్నారు. డీజీపీ మొదలుకొని.. మాజీ సీఎస్‌ నీలం సాహ్ని, సీఎంవో ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు ఏబీవీ.మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన కామెంట్స్‌ చేశారు ఏబీవీ. ఎల్వీ, నిమ్మగడ్డ ఎపిసోడ్‌ల మాదిరిగానే ఏబీవీ విషయంలోనూ ప్రభుత్వం వెంటనే అలర్ట్‌ అయింది. మీడియాతో మాట్లాడిన అంశాల ఆధారంగా క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తూ జీవో జారీ చేసింది.

మొత్తానికి తగ్గేదే లేదన్నట్టుగా జగన్ సర్కార్‌ తీరు ఉండటంతో తోక జాడించే అధికారులు చాలా మంది గప్‌చుప్‌ అయినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news