తిరుపతి రుయా ఘటనపై జగన్ సీరియస్

-

తిరుపతి: రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు 11 మంది మృతి చెందారు. ఈ  ఘటనపై  సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో  ఉన్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు రుయా ఆస్పత్రిని కలెక్టర్ హరినారాయణ సందర్శించారు. తమిళనాడు నుంంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి రాలేదని పేర్కొన్నారు. దీంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి విషాదం చోటు చేసుకుందని కలెక్టర్ తెలిపారు.
మరోవైపు ఈ ఉదయం 11.30 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి స్పందన కార్యక్రమంపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలు హాజరుకానున్నారు.
ఇక తిరుపతి రుయా ఘటన పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసు కోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
మరోవైపు రుయా ఘటనకు బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి జవహార్ ఎద్దేవా చేశారు. కరోనా మరణాలు కాదవి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. రుయా సంఘటన మొదటిది కాదన్నారు. గుణపాఠం నేర్చుకొని ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రజల ప్రాణాలపై శ్రద్ద పెట్టాలని కోరారు. ప్రణాళికతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కరోనా మృతులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మృతులకు గౌరవ ప్రదమైన అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు జరిగేటట్లు చూడాలని కోరారు. జగన్ అంతః పురం వదిలి బయటకు వచ్చి ప్రజలకు బతుకు భరోసా కల్పించాలని జవహర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news