విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టు పనులు ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహం, స్మృతి వనం పనులపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని అధికారులు సీఎం జగన్ కి వివరించారు.
అన్ని స్లాబ్ వర్కులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామన్నారు. అయితే పనుల్లో నాణ్యత పాటించాలని, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు సీఎం జగన్. పనుల పర్యవేక్షణ కోసం ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి కమిటీ ఎప్పటికప్పుడు నిర్మాణాలను పరిశీలించాలని, సూచనలు చేయాలని చెప్పారు.