తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఉదయం పూట.. ఈ పర్యటన చేయనున్నారు సీఎం జగన్. ఈ పర్యటనలో భాగంగా 13 రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులతో సభా స్థలం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన తిలకించనున్నారు.
అనంతరం లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు సీఎం జగన్. 11:20 గంటల నుంచి 1.10 వరకు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం, అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగం, కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
అయితే, సి.ఎం పర్యటన నేపథ్యంలో రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.ఉదయం ఏడు గంటల నుంచి రాజమండ్రి నగరంలో ఆర్టిసీ బస్సులు దారి మళ్లింపు చేశారు. స్టేడియం రోడ్, వై-జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్సులు జాతీయరహదారి మీదుగా డైవర్షన్ చేయనున్నారు. బహిరంగ సభకు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు పోలీసులు.