తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ నెలలో ఖాళీగా ఉన్న మూడు మండలి స్థానాలకు దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేశారు. వీరు ఈ నెల 9వ తేదీన నామినేషన్లు వేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. ఆ మూడు స్థానాలకు కూడా బిఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మార్చి 29న అలిమినేటి కృష్ణారెడ్డి, వూలోళ్ళ గంగాధర్ గౌడ్, కురుమయ్య గారి నవీన్ కుమార్ లు పదవి విరమణ చేయనుండడంతో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నామినేషన్ల దాఖలుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లు కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.