సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్… వారందరికీ ఇళ్ల పట్టాలు

-

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నల్లగొండ మున్సిపాలిటీ లో మౌలిక వసతులు మెరుగుపరచడం, పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సీఎం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో కూడిన సమీక్ష సమావేశం నిర్వహించారు.

kcr

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాల్గొని అక్కడే స్థిరపడిపోయి, దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్న అర్హులైన కుటుంబాలకు ఇంటి క్వార్టర్లకు, స్థలాలకు పట్టాలిచ్చేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా అక్కడే నివాసం ఏర్పరచుకున్న కాలనీవాసులతోపాటు, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో ప్రాజెక్టుల కింద కూడా ఈ సమస్యలు ఉన్నాయని, అక్కడ కూడ అర్హులైన వారికి పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న వారికి శాశ్వత పట్టాలు కల్పించాలని, ఆ దిశగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఫోన్లో ఆదేశించారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొని ఇక్కడే నివాసం ఉంటున్న కాలనీ వాసులకు పట్టాలిస్తామని గతంలో మాట ఇచ్చామని, ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “మాట ఇచ్చినపుడు ఆ మాట నిలబెట్టుకోవడం ధర్మమని, మనది ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని” ప్రజా ప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు. ఇపుడు ఎన్నికల కోడ్ కూడా తొలగిపోయినందున అర్హులైన సాగర్ కాలనీవాసులకు, నియమ నిబంధనలను అనుసరించి, కొంత వెసులుబాటును కల్పించి అయినా సరే, పట్టాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version