కేసీఆర్ సరికొత్త వ్యూహం అదేనా… కమలనాథులు చిక్కుతారా?

-

కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేన్నర ఏళ్ళు అయిపోతున్నాయి. అలాగే అంతకముందు నాలుగున్నర ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. వెరసి ఈ ఏడేళ్లలో ఎప్పుడు సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నాయకులకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన సందర్భాలు లేవు. ఏదో అసెంబ్లీలో కలవడం తప్ప, మిగతా సమయంలో విపక్ష నేతలు కేసీఆర్‌ని కలవలేదు.

కేసీఆర్

కానీ ఊహించని రీతిలో తాజాగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్లో దళిత మహిళ మరియమ్మ లాక్‌పడెత్‌ ఘటన విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. అలాగే సీఎంని కలిసి మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కేసీఆర్‌ని కోరారు. ఇక కోరిన వెంటనే కేసీఆర్ స్పందిస్తూ, బాధితురాలి కుమారుడు ఉదయ్‌ కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందజేయాలని, ఇద్దరు కుమార్తెలకు చెరో రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందచేయాలని సీఎస్‌ని ఆదేశించారు.

అయితే సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం తెలుగు రాష్ట్రాల్లో అరుదుగా జరుగుతుంది. ఆ అరుదైన ఘటన ఇప్పుడు జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యని కేసీఆర్ వెంటనే పరిష్కరించారు. ఇలా విపక్ష ఎమ్మెల్యేలని కలుసుకుని కేసీఆర్ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చారు.

కాకపోతే ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై కూడా విశ్లేషకుల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీతో టీఆర్ఎస్ గట్టిగా పోటీ పడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ వీక్ అవ్వడంతో బీజేపీ హఠాత్తుగా రేసులోకి వచ్చింది. దీంతో టీఆర్ఎస్-బీజేపీల మధ్యే వార్ నడుస్తోంది. పైగా ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరి, హుజూరాబాద్ బరిలో నిలబడ్డారు. ఇలాంటి సమయంలో కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కలవడం చర్చనీయాంశమైంది. అంటే కాంగ్రెస్‌ని దగ్గర చేసుకుని, కమలనాథులకు చెక్ పెట్టాలని గులాబీ బాస్ చూస్తున్నారా? అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి అనేది రానున్న రోజుల్లో బయటపడే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news