సమస్త వ్యవస్థల్లో సమాన హక్కుల కోసం ఎంతో పరితపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకున్నారు. రాష్ట్రంలోని సబ్బండ కులాలకు, మహిళలకు, పేద వర్గాలకు అవసరమైన అన్ని రకాల ఆసరాను అందిస్తూ.. అంబేడ్కర్ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ స్ఫూర్తితో దేశంలో దళిత, సకల జనుల సంక్షేమానికి తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని పునరుద్ఘాటించారు.
‘‘కష్టంతో కూడుకున్న ఎంతటి సుదీర్ఘమైన ప్రయాణమైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే.. గమ్యాన్ని చేరుకోవడం ఖాయమని అంబేడ్కర్ చాటిచెప్పారు. ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తాత్వికతకు ఆయన జీవితమే నిదర్శనం. వర్ణం, కులం పేరుతో వివక్షను, అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా.. ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు ఆయన.‘‘ అని కేసీఆర్ అన్నారు.
అందుకే ఈ తెలంగాణ బాంధవుడికి ఘన నివాళిగా.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల బాబా సాహెబ్ అంబేడ్కర్ మహా విగ్రహాన్ని.. ఆయన జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుండడం యావత్ దేశానికే గర్వకారణమన్నారు.