తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే అప్రమత్తమైన అధికారులు ప్రజలకు సహాయక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో సైతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే ఉండనున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ భారీ వర్షాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అయితే.. అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలపైన, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌పై కేసీఆర్ సెటైర్లు వేశారు. పీయూష్ గోయల్ కాదు ఆయన పీయూష్ గోల్‌మాల్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన నెత్తిలేని సన్నాసి.. రైతులను అవమానించేలా మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు నూకలు తినాలా? అని మండిపడ్డారు. ఇండియన్ డెమోక్రసీని బీజేపీ హత్య చేస్తోందని, ఏక్‌నాథ్ షిండేలు వస్తారని బీజేపీ నేతలు బాహాటంగా మాట్లాడుతున్నారని, దేనికైనా లిమిట్ ఉంటుందంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశంలోని ఏ వ్యవస్థపైనా బీజేపీకి గౌరవం లేదని, తప్పు చేస్తే భయ పడతాము, మీకు ఎవరు భయ పడతారంటూ ఆయన మండిపడ్డారు. లక్షల టన్నులు రైస్ మిల్లుల లో మూలుగుతుందని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో బొగ్గు నిలువలు ఉన్నా ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థ ప్రధాని నరేంద్ర మోదీ అని, మాకు వ్యక్తిగతంగా మోదీతో ఎలాంటి విరోధం లేదన్న కేసీఆర్.. ఆయన విధానాలపైనే మాకు అభ్యంతరమన్నారు.