ఈనెల 16 , 17 ,18 తేదీలలో జాతీయ సమైక్యతా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉత్సవాల నిర్వహణా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 16 , 17 ,18 తేదీలలో హైదరాబాద్ తోపాటు అన్ని నియోజక వర్గాలు, జిల్లా కేంద్రాల్లో ఈ జాతీయ సమైక్యతా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను సి.ఎస్ ఆదేశించారు.
ఈనెల 17 వ తేదీ న జరిగే ప్రధాన కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని తెలిపారు.అదేరోజు, ఆదివాసీ, బంజారా భవన్ లను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇదేరోజు నెక్లెస్ రోడ్ నుండి గుస్సాడీ, గోండ్, లంబాడి తదితర 30 కళారూపాల కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించాలని, ఈ ర్యాలీ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారని వెల్లడించారు. సెప్టెంబర్ 16 న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో విద్యార్థులు, యువత, మహిళలచే ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. ఇదేవిధమైన కార్యక్రమాలను 18 వతేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని సోమేశ్ కుమార్ తెలిపారు.