వికారాబాద్ లో కొత్త కలెక్టరేట్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడకపోతే వికారాబాద్ జిల్లా అయ్యేదా? ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ ను జిల్లాగా చేశామని అన్నారు. వికారాబాద్ కు సీఎం వరాల జల్లు కురిపించారు. వికారాబాద్ కి ఓ మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజీలను మంజూరు చేశారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని అన్నారని..ఇప్పుడు కర్ణాటక, ఏపీలో కంటే భూముల ధరలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే ఏపీలో మూడు ఎకరాలు కొనచ్చని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రజలు మోసపోతే గోసపడే పరిస్థితులు వస్తాయి. వచ్చిన తెలంగాణను మళ్లీ గుంటనక్కలు వచ్చి పీక్కొని తినకుండా, పాత పద్దతికి మళ్లీ పోకుండా, మళ్లీ పరిస్థితులు దిగజారకుండా, వారి రాజకీయ స్వార్థాలకు బలికాకుండా ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్.