కేసీఆర్ వ్యూహాలు వారికి అర్ధమైతే టీఆర్ఎస్‌కే ఇబ్బందా?

-

హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతున్నారు. అక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఎలాగైనా చెక్ పెట్టాలనే లక్ష్యంతో కేసీఆర్ ముందుకెళుతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో మకాం వేసి టీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడుతున్నారు. అటు కేటీఆర్, హరీష్ రావులు కూడా తమదైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు.

cm-kcr
cm-kcr

ఈ క్రమంలోనే హుజూరాబాద్‌లో గెలుపు దక్కించుకోవడం కోసం, ఆ నియోజకవర్గంపై కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ దళితబంధు పేరిట పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఒక్క నియోజకవర్గానికే దాదాపు 1500 కోట్లపైనే ఖర్చు పెట్టనున్నారని తెలుస్తోంది. అలాగే బీసీల తర్వాత నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న దళితులకు లబ్ది జరగనుంది. దాదాపు 20 వేల కుటుంబాలకు పథకం అందించడానికి ప్రభుత్వం చూస్తుంది.

అంటే ఏ స్థాయిలో పథకం లబ్దిదారులు ఉంటారో చెప్పాల్సిన పని లేదు. ఇదేగాక నియోజకవర్గానికి ప్రభుత్వం నిధుల వరద పారిస్తుంది. హుజూరాబాద్‌, జమ్మికుంట మునిసిపాలిటీల్లో రూ.66.85 కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నారు. అలాగే హుజూరాబాద్‌లోని ఐదు మండలాల్లోని 106 గ్రామ పంచాయతీల్లో రూ.100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది.

అయితే హుజూరాబాద్ ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ స్థాయిలో నిధుల వరద పారిస్తుందని సామాన్యుడుకు సైతం అర్ధమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎన్నిక లేకుండా నిధులు ఇస్తే బాగానే ఉండేదని, కానీ ఉపఎన్నికని పెట్టుకుని నిధులు ఇస్తే అక్కడి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి మద్ధతుగా ఉంటారనే విషయాన్ని చెప్పలేమని, ఎందుకంటే ఎన్నికల ముందు అధికారంలో ఉండే పార్టీలు చేసే స్టంట్లు ప్రజలకు తెలుసని, కాబట్టి ఈ కార్యక్రమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news