ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మోదీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనడం లేదు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బేగంపేట విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం 1.30కు ప్రధానికి స్వాగతం పలుకుతారు. సాయంత్రం ఆరున్నర గంటలకు వీడ్కోలు కార్యక్రమంలోనూ పాల్గొంటారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని చివరిసారిగా 2021 సెప్టెంబరులో దిల్లీలో కలిశారు. ఆ తర్వాత వారి భేటీ జరగలేదు. గత ఫిబ్రవరిలో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని రాగా కేసీఆర్ ఆయన పర్యటనలో పాల్గొనలేదు. మేలో ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవానికి మోదీ హాజరు కాగా సీఎం వెళ్లలేదు. జులైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైనప్పుడూ దూరంగా ఉన్నారు. శనివారం జరిగేది ప్రధాని అధికారిక కార్యక్రమం కాగా.. ఎరువుల కర్మాగారం పునరుద్ధరణలో 11 శాతం నిధులు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం వాటాదారుగా ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరైన ప్రాధాన్యం ఇవ్వలేదనే కారణంతో ఈ పర్యటనలో పాల్గొనకూడదని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.