హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేటి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. పల్లె, పట్టణ ప్రగతిని ఆయన క్షేత స్థాయిలో పరిశీలించనున్నారు. ఆదివారం ఉదయం 11.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సిద్దిపేటకు చేరుకుంటారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సిద్దిపేట శివారులో నిర్మించిన పోలీస్ కమిషరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ భవనానికి కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం కామారెడ్డిలో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాన్ని, తదుపరి జిల్లా పోలీసు కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
సోమవారం వరంగల్‌లో…
సీఎం కేసీఆర్ సోమవారం వరంగల్‌లో పర్యటిస్తారు. అక్కడ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మంగళవారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శిస్తారు. అనంతరం వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో నిర్మితమైన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ భవనం, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాలను సీఎం ప్రారంభించనున్నారు. మధ్యా హ్నం మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంట్లో సీఎం కేసీఆర్ భోజనం చేయనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రికి వెళ్తారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. గ్రామాభివృద్ధి ప్రణాళికల అమలుపై చర్చిస్తారు.