ఎనిమిదో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ముకరం ఝా పార్థీవదేహం హైదరాబాద్ చేరుకుంది. టర్కీలో చనిపోయిన ఆయన మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి చౌమహల్లా ప్యాలెస్కు తీసుకెళ్లారు. సాయంత్రం 7 గంటలకు సీఎం కేసీఆర్ ఆయన పార్థీవదేహానికి నివాళి అర్పించనున్నారు. రేపు ముకరం ఝా అంత్యక్రియలు జరుగుతాయి.
హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ముకరం ఝా అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నారు. ఆయన చివరి కోరిక మేరకు కుటుంబసభ్యులు హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జనవరి 14న మరణించిన ఆయన భౌతికకాయం ఇవాళ చార్టర్డ్ ఫ్లైట్లో హైదరాబాద్ చేరుకుంది. ఆయన భౌతిక కాయాన్ని చౌమహల్లా ప్యాలెస్ కు తీసుకెళ్లనున్నారు. ఆయన కడసారి చూపు కోసం బంధు మిత్రులతో పాటు సాధారణ జనం భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో చౌమహల్లా ప్యాలెస్ వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఆసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద ముకరం ఝాను ఖననం చేయనున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు.