మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభించి జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్. అనంతరం సంగం బ్యారేజీ వద్ద దివంగత వైయస్ఆర్, మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ..సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తిచేశాం.. వీటిని జాతికి అంకితం చేశామన్నారు. 5 లక్షల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించాం.. ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కావలి నియోజకవర్గాలకు మేలు జరుగుతుందని వెల్లడించారు.
దేవుడి దయవల్ల వరుసగా నాలుగో ఏడాదికూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయని.. రైతన్నల మోములో చిరునవ్వులు కనిపిస్తున్నాయని తెలిపారు. నాలుగేళ్లలో ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని.. దేవుడి దయతో మంచి వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తోందని స్పష్టం చేశారు. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీని, మరికాసేపట్లో నెల్లూరు బ్యారేజీని అంకితం చేస్తున్నామని.. 3.45లక్షల ఎకరాలకు వర ప్రదాయిని అయిన సంగం బ్యారేజీని ప్రాధాన్యతా ప్రాజెక్టుగా మన ప్రభుత్వం గుర్తించి నిర్మాణాల్లో వేగం పెంచిందని తెలిపారు సీఎం జగన్.