రోజుకో వివాదంతో బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకు హాస్టల్‌లో నెలకొన్ని సమస్యలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగాయి. తాజాగా మరో వివాదం వెలుగు చూసింది. విద్యార్థినులపై కాలేజీ స్టాఫ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. తనను ఇద్దరు ఉద్యోగులు లైంగికంగా వేధించారంటూ ఒక విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. వారి సెల్ ఫోన్లను సీజ్ చేయడమే కాక… విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. వేధింపులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఇద్దరు ఉద్యోగులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఓ విద్యార్ధిని బాసర ట్రిపుట్ ఐటీ ఉన్నతాధికారులకు గురువారంనాడు ఫిర్యాదు చేసింది. అకౌంట్ సెక్షన్ లోని అధికారితో పాటు కిందిస్థాయి ఉద్యోగి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ విద్యార్ధిని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరిని వర్శిటీ అధికారులు విచారించారు. ఫిర్యాదు చేసిన విద్యార్ధిని తనకు బంధువు అవుతుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరు చెప్పారు.
అయితే బాధిత విద్యార్ధిని తమకు బంధువు కాదని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భార్య తేల్చి చెప్పారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరి ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు వారిద్దరి ఫోన్లను కూడా సీజ్ చేసి విచారణ నిర్వహిస్తున్నారు.ఈ విషయమై విచారణకు కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా ఈ కథనం తెలిపింది. ట్రిపుల్ ఐటీ కాలేజీ నుండి విద్యార్ధిని బయటకు వెళ్లేందుకు ఔట్ పాసులు జారీ చేసే విషయమై ఏర్పడిన పరిచయం కారణంగా మరో అధికారి వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్ధిని ఆరోపించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డైరెక్టర్ సతీష్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.