టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత అలీకి ఎట్టకేలకు పదవి దక్కింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ముత్యాలరాజు జారీ చేశారు. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరే ఆయనకు కూడా జీతభత్యాలు అందనున్నాయి. మరోవైపు తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించడంపై అలీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అయితే దీనిపై తాజాగా అలీ స్పందిస్తూ.. వైసీపీలో చేరిన తొలిరోజు నుంచే తాను పార్టీ కోసం పని చేస్తున్నానని చెప్పారు. పార్టీలో పదవులను తాను ఏనాడూ ఆశించలేదని అన్నారు. ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడంతో పాటు, పార్టీ అప్పగించిన పనులను నిబద్దతతో పూర్తి చేశానని… తన సేవలను జగన్ గుర్తించారని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని అన్నారు. ఈ పదవిని తన కూతురి పెళ్లికి జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని చెప్పారు.