ఈ నెల 16న హనుమాన్ శోభాయాత్ర జరిగింది. ఆ యాత్రలో సమస్యాత్మక చర్యలు కొన్ని జరిగాయి. ఘర్షణాత్మక వాతావరణం నుంచి అక్కడి ప్రాంతం ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ స్థానిక పెద్ద ఢిల్లీ నగర పాలక సంస్థకు రాసిన లేఖ కారణంగానే ఇదంతా జరిగిందని ఆధారాలతో సహా మాట్లాడుతోంది విపక్షం. ఘటనకు కారణం అయిన వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయాలని చెప్పడం వెనుక అసలు ఆంతర్యం ఏంటన్నది బయటకు వెల్లడించాలని కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ముందస్తు నోటీసులు లేకుండా తమ దుకాణాలు ఎలా కూల్చేస్తారంటూ స్థానిక వ్యాపారులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.
దేశ రాజధానిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఓ సందిగ్ధ వాతావరణం నెలకొని ఉంది. బుల్డోజర్ ఫార్ములాను ఎప్లై చేస్తున్న కేంద్రం పై అంతా మండిపడుతున్నారు. మత ఘర్షణల్లో భాగంగా దాడులకు పాల్పడిన వారిని శిక్షించాల్సింది పోయి, ఇళ్లను కూల్చివేయడం ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. కానీ బీజేపీ వర్గాలు దీన్నొక సాహసోపేత నిర్ణయంగానే చూస్తున్నాయి. అక్రమ కట్టడాల పేరిట కూలుస్తున్నామని కూడా చెప్పుకుంటున్నాయి. ఓ విధంగా ఘటనలకు కారణం అయిన వారిని ఉద్దేశించి బీజేపీ కూడా ఎక్కడా వెనక్కు తగ్గకుండా వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఘర్షణలు నియంత్రించి, పౌరులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత గల ప్రభుత్వం మళ్లీ మళ్లీ పాత గాయాలను ఎందుకు రేపుతోందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఆ విధంగా ప్రజల ప్రశాంతతను ఎందుకు పోగొడుతున్నదని ప్రశ్నిస్తున్నాయి.
ఢిల్లీలో ముస్లింల ఇళ్ల కూల్చివేత..
బుల్డోజర్ అరాచకం..
అమిత్ షా ఇంటి కూల్చివేసినపుడే అల్లర్లు ఆగుతాయి..
రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం ..
ఇదీ ఇవాళ్టి పరిణామాలకు తార్కాణం. నిన్నటి వేళ దేశ రాజధానిలో బుల్డోజర్ల ప్రయోగం అన్నది పెను దుమారం రేపింది. ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న జహంగీర్ పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట అధికారులు అతి చేస్తున్నారంటూ రంగంలోకి కమ్యూనిస్టులు వచ్చారు. సంబంధిత కీలక నేత బృందా కారత్ తన వాదన వినిపిస్తూ బుల్డోజర్ ను అడ్డుకున్నారు. అదేవిధంగా ఘటనా స్థలికి చేరుకునేందుకు ఎంఐఎం అధినేత ఓవైసీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మరింత ఉద్రిక్తంగా మారింది. సుప్రీం జోక్యంతో ప్రస్తుతం అక్కడ యథాతథ స్థితి కొనసాగనుంది. దీనిపై గురువారం విచారణను చేపట్టనున్నారు. జమైత్ ఉలామా – ఇ – హింద్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం స్పందించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు సుప్రీం ఆదేశాలు ఉన్నా కూడా గంటకు పైగా కూల్చివేతలు చేపట్టారు. తరువాత మళ్లీ సుప్రీం దృష్టికి విషయం వెళ్లడంతో మళ్లీ సీజే రమణ జోక్యంతో ఆగాయి. సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించడంతో సమస్య కాస్త ఆగింది.