రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ డిమాండ్లు ఇవే.. కేసీఆర్ స్పందిస్తారా?

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యూత్ అధ్యక్షుడు శివ సేనా రెడ్డి, ఎన్‌ఎస్‌యూ‌ఐ అధ్యక్షుడు వెంకట్, నాయకులు మర్రి శశిధర్ రెడ్డి సత్యాగ్రహా దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘‘పేద ప్రజలకు కరోనా, బ్లాక్ ఫంగస్ వైద్యం ఉచితంగా అందించాలి. దేశంలోనూ, రాష్ట్రంలో కరోనో, బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివరణలో పూర్తిగా విఫలం అయ్యాయి. వైద్యం కోసం పేదలు ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి. ఆరోగ్య శ్రీ లో కరోనా, బ్లాక్ ఫంగస్ చేర్చి ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్సలు చేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది.’’అని విమర్శించారు.

సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ర్టంలో భయంకర పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాలు ఇండియా నుంచి వచ్చే వారిని రానివ్వటం లేదని, వ్యాక్సిన్ కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇన్ని మరణాలకు సీఎం కేసీఆరే కారణమని వ్యాఖ్యానించారు. కరోనా దెబ్బ తిన్న కుటుంబాలకు ఉచిత వైద్యం,ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. శాసన మండలి, సభలో కరోనాని ఆరోగ్య శ్రీ లో చేర్చండి అని చెప్తే ఒప్పుకున్నారన్నారు. 9 నెలలు అవుతున్న ఇప్పటికీ అమలు కాలేదని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని, ప్రజల్ని గాలికొదిలేశారని భట్టి విమర్శించారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా బారిన పడి10 లక్షల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా‌ను ఆరోగ్య శ్రీలో చేర్చమంటే ఇప్పటికీ చేర్చలేదన్నారు. వైద్యం ఉచితంగా అందించమంటే రక్త పరీక్షలు ఉచితంగా చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. బ్లాక్ ఫంగస్, కరోనా వైద్యం ఉచితంగా అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, కోవిడ్‌తో చనిపోయిన కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

సిరిసిల్ల పట్టణం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ కరోనా, బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలి. తెలంగాణలో అనేకమంది రోగాలతో చనిపోతున్నా పట్టించుకోవడం లేదు. కరోనా‌తో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి’’. అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన సత్యాగ్రహ దీక్ష, నేతల డిమాండ్లపై సీఎం కేసీఆర్ స్పందిస్తారేమో చూడాలి.