దుబ్బాక ఎన్నికల్లో అసలు కాంగ్రెస్‌ పోటీ చేస్తుందా…?

-

దుబ్బాక ఉపఎన్నిక ప్రకటన రాకముందే.. కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌లో తొడలు కొట్టారు. ఆ సౌండ్‌ తెలంగాణ అంతా వినిపించింది. కొత్తగా రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న మాణిక్యం ఠాగూర్ బాడీ లాంగ్వేజ్‌ చూస్తే.. దుబ్బాకలో కాంగ్రెస్‌ ఒక ఊపు ఊపేస్తుందేమోనని అంతా అనుకున్నారు. తీరా నోటిఫికేషన్‌ వచ్చాక చూస్తే.. పార్టీ లీడర్లు అడ్రస్‌ లేకుండా పోయారు. ఎన్నికల బరిలో జాతీయ పార్టీగా నిజంగా ఉందా అన్న సందేహం వ్యక్తమవుతుంది.

దుబ్బాకలో పరిస్థితిని చూస్తే.. అక్కడ గెలుపు కోసం రెండు పార్టీలే పోరాడుతున్నాయేమో అన్న అనుమాం రాకపోదు. దుబ్బాక ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ మౌనం వ్యూహాత్మకమా.. ఓడిపోతామని ముందే ఊహించుకుందా.. అర్ధం కావడంలేదు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దుబ్బాకలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నా.. ఎక్కడా కాంగ్రెస్‌ ఊసే కనిపించడంలేదు. చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే.. అదికార పార్టీ టీఆర్‌ఎస్‌ కూడా.. కాంగ్రెస్‌ను తన ప్రత్యర్థిగా పరిగణిస్తున్నట్లు లేదు.

తెల్లారితే టీఆర్‌ఎస్‌ నేతలు.. బీజేపీని మాత్రమే టార్గెట్‌ చేస్తున్నారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో 62వేల పైచిలుకు ఓట్లతో టీఅర్ఎస్‌ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ అదే చోట గెలవడం.. ఆ పార్టీకి నల్లేరు మీద నడకలాంటిది. అయినప్పటికీ.. అశ్రద్ధ చేయకుండా ఆర్ధిక మంత్రి హరీశ్‌ రావు.. గడప గడపకీ తిరిగి ప్రచారం చేసుకుంటున్నారు. అటు ఉపఎన్నికల ప్రకటన రాకముందే.. ప్రచారం ప్రారంభించారు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు. గడచిన వారం రోజులుగా.. ఈ రెండు పార్టీల మధ్యా నెలకొన్న ఘర్షణ వాతావరణ చూస్తే.. ఎన్నిక టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఉంది తప్ప.. కాంగ్రెస్‌ ప్రభావం ఎక్కడా లేదన్నది అర్ధమైపోతుంది.

టీఆర్‌ఎస్ సైతం బీజేపే తన ప్రత్యర్థి అన్నట్లుగా.. కమలం గ్యాంగ్‌పై విమర్శలు ఎక్కుపెడుతోంది. కమలనాధులైతే.. కాంగ్రెస్‌ పార్టీ ఒకటి ఉందనే విషయాన్ని కూడా మరచిపోయారు. అయితే దుబ్బాక సీటైనా కొట్టాలి.. కనీసం రెండో స్థానంలో నిలబడాలి అన్న కసితో పనిచేస్తున్నారు. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు నోట్ల కట్టల ఆరోపణల దగ్గర నుంచి.. వ్యక్తిగత ఆరోపణల వరకు, ఇలా ఒకటి కాదు.. అసెంబ్లీ ఎన్నికలను దాటి వెళ్లిపోయింది దుబ్బాక రాజకీయం.

ఇంత హోరెత్తిపోతున్న ఎన్నికల్లో తమ ప్రస్థావనే ఎందుకు రావడంలేదో.. కాంగ్రెస్‌కు అర్ధంకావడంలేదు. పరిస్థితికి తగినట్లుగానే.. కాంగ్రెస్ అగ్రనేతలంతా దుబ్బాకకు వచ్చామా, వెళ్లామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప.. గెలుపు కోసం భుజానికి కాడెత్తున్నకున్నవాడు ఎవడూ లేడు. ఆ పార్టీనేతలు కనీసం ఆలోచిస్తున్నట్లు కూడా లేదు. ఫలితం తెలిసి ముందే డిసైడ్‌ అయిపోయారా ? వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారా ? ఎవరికీ అర్ధం కావడంలేదు.

Read more RELATED
Recommended to you

Latest news