కాంగ్రెస్ పార్టీ కావాలనే తనపై బురద చల్లుతోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై నిర్వహించిన సమావేశంలో.. తాను బాలిక పేరు, ఫోటో, ఊరి పేరు చెప్పలేదని పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వీడియోను ప్రదర్శించారని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తానూ న్యాయవాదినని, తనకూ చట్టాలు తెలుసని రఘునందన్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే తనపై బురద చల్లుతోందన్నారు. తాను బాధితురాలి తరఫునే మాట్లాడానని, ఎంఐఎం పార్టీపై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్‌కు ఎందుకు కోపం వస్తుందన్నారు. ఎంఐఎంను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. బాధితురాలికి సంబంధించిన ఎలాంటి వివరాలు మీడియాలో వెల్లడించలేదన్నారు. పోలీసులకు ధైర్యం ఉంటే.. వీడియో తీసిన వాళ్లపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.