ఎన్నికలకు ఎంత కాలం ఉందో తెలియదు. అస్సలు ఎన్నికలు ఎప్పుడొస్తున్నాయో కూడా నిర్థారణలో లేదు. నిరూపణలో లేదు. అంతా ఊహగానాలే ! అన్నీ నిరాధార వార్తలే! కానీ ఇదే సమయంలో కొన్ని మాటలు మాత్రం నమ్మశక్యంగానే ఉన్నాయి. వచ్చేఏడాదిలోనో లేదా రెండేళ్లలోనో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వైసీపీ పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పడంతో ఇప్పుడంతా ఆ మాట చుట్టూనే, ఆ మాటను ఆధారంగా చేసుకునే చర్చించుకుంటున్నారు.
ఈ చర్చ రోజుకో పరిణామానికి దారి తీస్తోంది. కొన్నిసార్లు దారి తప్పుతోంది కూడా ! ముఖ్యంగా సింహం సింగిల్ గా వస్తుంది అని అంబటి రాంబాబు అనే మంత్రి చెప్పినప్పటి నుంచి ఇంకా వివాదం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎవరెటు అన్నది సందిగ్ధత నెలకొని ఉంది. బీజేపీతో పవన్ ముందుకు వెళ్లాలని భావిస్తున్న తరుణాన కొత్త యుద్ధం రేగుతోంది. కాంగ్రెస్ నాయకులు తులసి రెడ్డి కన్నెర్ర జేస్తున్నారు. పొత్తుల విషయమై పవన్ కు చిత్త శుద్ధి లేదని, నిత్యం ధరవరలు పెంచుకుంటూ పోతున్న బీజేపీతో ఏ విధంగా పవన్ దోస్తీ కడతారని ప్రశ్నిస్తున్నారాయన.
ఇక పవన్ కూడా బీజేపీతోనే వెళ్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో టీడీపీ కూడా పవన్ తో వెళ్లాలని భావిస్తున్నా ఇంకా వీటిపై పెద్దగా క్లారిటీ లేదు. వాస్తవానికి జగన్ కూడా టీడీపీ పొత్తులపైనే ఫోకస్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేస్తే అందుకు జనసేన మద్దతు ఉంటే కాస్తో కూస్తో ప్రజా వ్యతిరేకతలు అన్నవి ఆ కూటమికి అనుకూలించే అవకాశాలున్నాయి. కానీ ఒక్క టీడీపీ బీజేపీ కలిసి ఉంటే అంతగా ఫలితాలు రావు అని కూడా అంచనాలు ఉన్నాయి.
కానీ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రేసులో పవన్ ను ఉంచితే మంచి ఫలితాలే వస్తాయని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు. పాలన పరంగా వైఫల్యాలు గురించి మాట్లాడిన ప్రతిసారీ జగన్ వర్గం ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మానుకుంటే మేలు అని కూడా అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ వ్యాఖ్యలపై కూడా జనసేన వర్గాలు మండిపడుతున్నాయి.