అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇంఛార్జ్ లతో నేడు కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలపరిచేలా వ్యూహాలు, ప్రణాళికల గురించి సమావేశంలో చర్చించనున్నారు. ద్రవ్యోల్భనానికి వ్యతిరేఖంగా ఈనెల 14 నుంచి 15 రోజుల పాటు కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. పక్షం రోజుల పాలు నిర్వహించే ఆందోళనపై ప్రముఖంగా చర్చించనున్నారు. దీంతో పాటు వచ్చే ఏడాది కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు ఉండటంతో, నవంబర్ 1 నుంచి కాంగ్రెస్ పార్టీ కొత్త సభ్యత్వాల నమోదుపై కార్యచరణ రూపొందించనుంది. చాలా కాలంగా రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా మసకబారుతున్న సమయంలో మళ్లీ క్రియాశీలకం కావాలనే సందేశాన్ని నాయకులు, పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రాష్ట్రాల్లో గెలుపు కోసం ప్రణాళికలను గురించి ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో చర్చించే అవకాశం ఉంది.