ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనని తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్లు పీకే వ్యవహారం తెలంగాణలో కాకరేపింది. కేసీఆర్ తో డీల్ కట్ చేసుకోవడానికే వచ్చాడని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రస్తుతం ఈ వాదనలన్నింటికీ తెరపడింది.
ఇదిలా ఉంటే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. కాంగ్రెస్లో పీకే చేరనని చెప్పిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రస్తుతం పీకే అవసరం కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్ పార్టీకీ, కేసీఆర్ కే ఎక్కువగా ఉందన్నారు. కేసీఆర్ ప్రస్తుతం ఒంటరి అయ్యారని.. గతంలో ప్రొఫెసర్ జయశంకర్, కోదండరామ్, ఈటెల, హరీష్ రావు వంటి సమర్థులు ఉండేవారని… ఇప్పుడు మాత్రం కేటీఆర్, చెంచాలు తప్ప కేసీఆర్ తో మాట్లాడేందుకు ఎవరూ లేరని.. కానీ కేసీఆర్ ను పీకే కాపాడగలడా..? పీకే దేవుడు కాదు.. అంటూ ట్వీట్ చేశారు.