కరోనా వైరస్.. పేరు చెబితేనే ప్రజలు ఆమడ దూరం పారిపోతున్నారు. ఈ వైరస్ దెబ్బకు కొన్ని దేశాలలో ప్రజా కదలిక పై ప్రభుత్వాలు నిషేధం విధిస్తే మరి కొన్ని చోట్ల ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. గత డిసెంబరు చైనాలో మొదలైన కరోనావైరస్ ప్రపంచ దేశాల ప్రజలను బలి తీసుకుంటుంది. కానీ చాలా దేశాలు ఈ వైరస్ నియంత్రణకు చైనాలా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం చైనాలో కరోనా మృతుల సంఖ్య అదుపులోకి వచ్చిందనే చెప్పాలి. అయితే ఇతర దేశాల్లో మాత్రం దీని ప్రభావం తీవ్రంగా ఉంది.
అలాగే జనవరి 19 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 100 మాత్రమే. కానీ, ఆ తర్వాత ఎంత వేగంగా ఈ వైరస్ పాకిపోయిందో చూస్తే ఎదరికైనా దిమ్మతిరిగిపోతుంది. ఫిబ్రవరి 19 నాటికి కరోనా కేసులు 76 వేలకు చేరాయి. ప్రస్తుతం 183 దేశాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 2.50 లక్షలుగా నమోదైంది. అలాగే జనవరి 22 నాటికి కరోనా కారణంగా 17 మంది మృతి చెందితే, ఫిబ్రవరి 20 నాటికి 2,247 మంది మరణించారు.
మరియు మార్చి 10 నాటికి ఆ సంఖ్య ఐదింతలై మృతుల సంఖ్య 10,541కి చేరింది. మరోవైపు ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మరణాలు ప్రమాదకర స్థాయిలో లేకున్నా, వేగంగా విస్తరిస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. నిన్న భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 167 కాగా, ఇవాళ అది 223కి చేరింది. దీంతో ప్రజలు మరింత భాయందోళనకు గురవుతున్నారు.