మళ్లీ చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. సమన్లు జారీ చేసిన కోర్టు

-

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మళ్లీ కోర్టు మెట్లెక్కబోతున్నాడు. సల్మాన్ ఖాన్‌‌ను కృష్ణ జింకలను చంపిన కేసు చాలా కాలం నుంచి వెంటాడుతున్నది. కాగా, తాజాగా మరో కేసు తెర మీదకు వచ్చింది. జర్నలిస్టు అశోక్ పాండే కంప్లయింట్ మేరకు ముంబైలోని అంధేరి కోర్టు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్, ఆయన బాడీ గార్డుకు సమన్లు జారీ చేసింది. ఈ కేసును తదుపరి విచారణకు న్యాయస్థానం వచ్చే నెల 5కు వాయిదా వేసింది.


తనతో 2019లో సల్మాన్ ఖాన్ మిస్ బిహేవ్ చేశాడని అశోక్ పాండే కంప్లయింట్ చేశాడు. తాను ఆ టైంలో సల్మాన్‌ను ఫొటో తీయడానికి బాడీ గార్డుల వద్ద అనుమతి తీసుకున్నానని, అయినప్పటికీ సల్మాన్ తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను కొట్టాలని సల్మాన్ తన బాడీ గార్డును ఆదేశించాడని వివరించాడు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ తన ఫోన్ లాక్కున్నాడని అన్నాడు. ఈ విషయమై తాను డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చాడు.

కేసును విచారించిన అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్.ఆర్.ఖాన్ వారికి సమన్లు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్, ఆయన బాడీ గార్డుపై ఐపీసీ సెక్షన్లు 504, 506 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొవిడ్ పరిస్థితుల వలన కేసు పరిశీలన ఇంత కాలం ఆలస్యమైందని, అయినప్పటికీ తన కేసును పరిశీలించి సమన్లు జారీ చేయడం పట్ల జర్నలిస్టు పాండే సంతోషం వ్యక్తం చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version