కరోనా మహమ్మారి దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. ఎటు చూసినా జనాల చావు కేకలు, ఆక్సిజన్ చాలక హాహాకారాలు వినిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు దేశవ్యాప్తంగా రోజుకు 3.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇంతటి ఆపత్కాలంలో ప్రధాని మోదీ ఏం నిర్ణయం తీసుకోనున్నారు ? దేశవ్యాప్తంగా మరోమారు లాక్‌డౌన్ విధిస్తారా ? దేశ ఆర్థిక వ్యవస్థా ? ప్రజల ఆరోగ్యమా ? దేనికి ప్రాధాన్యతను ఇస్తారు ? అని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
కర్ణాటకలో రోజూ 40వేలకు పైగా కోవిడ్ కేసులు అమలవుతున్నాయి. దీంతో అక్కడ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. అయితే సీఎం యడ్యూరప్ప అక్కడ లాక్‌డౌన్ విధించాలని భావిస్తున్నామని, కానీ ప్రధాని మోదీ ఏం చెబుతారన్న దాన్నిబట్టి తాము చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక పలు ఇంగ్లిష్ పత్రికల్లోనూ మోదీ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, దేశంలో కోవిడ్‌ను కట్టడి చేసేందుకు ఆయన లాక్‌డౌన్‌ను విధించాలా, వద్దా అనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారని కథనాలు వచ్చాయి. అటు యడ్యూరప్ప మాటలు, ఇటు ఇంగ్లిష్ పత్రికల్లో వచ్చిన కథనాలను చూస్తుంటే మోదీ లాక్‌డౌన్‌పై తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది.
లాక్‌డౌన్‌ను విధిస్తే దేశం మళ్లీ ఆర్థికంగా పతనమవుతుంది. గతేడాది లాక్ డౌన్ వల్ల ఎంత నష్టం వచ్చిందో, ఎంత మందికి ఉద్యోగాలు, ఉపాధి పోయాయో, ఎంత మంది ఆకలితో అలమటించారో తెలుసు. కనుక మళ్లీ లాక్‌డౌన్‌ను విధిస్తే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ లాక్‌డౌన్ పెట్టకపోతే కరోనా కట్టడి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎంతో మంది నిపుణులు ఇదే విషయం చెప్పారు. దీంతో మోదీ ఈ విషయమై ఏం నిర్ణయం తీసుకుంటారు ? అన్నది ఉత్కంఠను కలిగిస్తోంది. నేడో, రేపో ఆయన టీవీల్లో కనిపించి లాక్‌డౌన్‌ను విధిస్తున్నామని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ గతేడాదిలా కాకుండా ఈసారి లాక్ డౌన్‌ను విధించేందుకు 2-3 రోజుల గడువు ఇస్తారని తెలుస్తోంది. మరి ప్రధాని మోదీ ఏం చేస్తారో చూడాలి.