రాష్ట్రపతి ఎన్నిక పై ప్రతిపక్ష పార్టీలు సమావేశం అవుతున్నాయని.. ఏపీలో ఉన్న టీడీపీ, వైసీపీల వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు సీపీఐ రామకృష్ణ. దేశంలో లౌకిక వాదానికి పెను ప్రమాదం సంభవించిందని.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మోడీ పాలన సాగిస్తున్నారన్నారు. మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు జగన్ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీపీఐ రామకృష్ణ. ఇటీవల మోడీని కలిసిన జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం సాగుతుందని.. 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అని జగన్ హామీ ఇచ్చారన్నారు.
2014 ఎన్నికలలో ఓడినప్పటి నుండి 2019ఎన్నికల వరకు ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పింది వాస్తవం కాదా..? అని నిలదీశారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక కోసం జగన్ అవసరం వాళ్లకి ఉందని.. ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతిస్తానని జగన్ ఎందుకు చెప్పడం లేదు..? మెడలు వంచుతా అన్న వాడివి. నోరెందుకు విప్పవు..? అని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలు సమావేశానికి హ్యాండ్ ఇచ్చావని.. మెడలు వంచడం కాదు.. నువ్వే మోకాలు వంచుతున్నావని తెలిపారు. మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వంత పాడుతున్నావని.. జగన్ను నమ్మి గెలిపిస్తే.. నీ స్వార్ధ ప్రయోజనాల కోసం పని చేస్తున్నావని ఆగ్రహించారు. టీడీపీ, వైసీపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటు ఉంటారో చెప్పాలని ఫైర్ అయ్యారు.