ఒకప్పుడు స్కూటర్‌పై తిరిగాడు. పాన్ మసాలా తయారీదారులకు పర్‌ఫ్యూమ్‌ను సరఫరా చేశాడు. ఇది పైకి మాత్రమే. అంతర్లీనంగా దేశంలోనే అతిపెద్ద నగదు సరఫరాదారుడిగా మారాడు. అతడి ఇండ్లు, కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడి చేసి రూ.200కోట్లకుపైగా నగదు, పెద్ద ఎత్తున బంగారం సీజ్ చేయడంతో అత్తర్ వ్యాపారి పీయూష్ జైన్ అసలు వ్యాపారం బయట పడింది.
అత్తర్ వ్యాపారి గురించి ఐదు ఆసక్తికర విషయాలు
పీయూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీలలో జరిపిన సోదాలలో రూ.194కోట్ల అక్రమ నగదు బయటపడింది. ఇందులో కాన్‌పూర్‌లోని అతడి నివాసంలో రూ.177కోట్లను జప్తు చేయగా, కనౌజ్‌లోని ఫ్యాక్టరీలో రూ.17కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా దుబాయిలో స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను కూడా సీజ్ చేశారు.
ఆరు రోజుల తనిఖీల్లో రూ.11కోట్ల విలువైన 23 కిలోల బంగారాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలోని నేల మాలిగలో నుంచి రూ.6కోట్ల విలువైన 600 కిలోల ఎర్రచందనం నూనెను కనుగొన్నారు.
పియూష్ జైన్, అతని సోదరుడు అంబరీష్ జైన్ వారి తండ్రి రసాయర శాస్త్రవేత్త నుంచి అత్తర్ తయారీని నేర్చుకున్నారు. పాన్ మసాలా తయారీదారులకు అత్తర్ పదార్థాలను విక్రయించడం ప్రారంభించిన తర్వాత వారికి సంబంధించిన ఓడోకెమ్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందింది. లావాదేవీలకు నగదు రూపంలో చెల్లింపులు చేస్తుండటంతో ఇబ్బందులు పడ్డారు.
పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం ఆధారంగా జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు శిఖర్ పాన్ మసాలా తయారీదారులకు ఉచ్చు బిగించారు. అదే క్రమంలో పీయూష్ జైన్‌కు ట్రాప్‌లో పడ్డారు.
వందల కోట్ల నగదు బయటపడిన పీయూష్ జైన్ ఇంటి ఆవరణలో మాత్రం పాత స్కూటర్, క్వాలీస్, మారుతి కార్లు పార్కు చేసి ఉండటం గమనార్హం. కానీ, ఇవేవీ అతను తన ఇంటిలో దాచుకున్న అపారమైన నగదు బయట పడకుండా దాచలేకపోయాయి.