ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకు పెద్ద ఎత్తున నష్టాన్ని తెచ్చి పెడతాయి. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం, మరికొన్ని సందర్భాల్లో ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంటుంది. బెంగుళూరులో ఇవాళ జరిగిన ఎయిర్‌షోలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాద ఘటనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అగ్ని ప్రమాదం జరగడానికి ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని తెలిసింది. ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే…
బెంగుళూరులో ఇవాళ ఏరో ఇండియా షో జరిగిన విషయం విదితమే. అందులో భాగంగా పైలట్లు విమానాలతో విన్యాసాలు చేశారు. కాగా తేజస్ యుద్ధ విమానంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ప్రయాణించింది. అయితే షోలో భాగంగా ఓ గేటు వద్ద పార్కింగ్ స్థలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న 80 కార్ల వరకు దగ్ధం అవ్వగా, భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఇక ఈ భారీ అగ్నిప్రమాదానికి ఒక వ్యక్తి నిర్లక్ష్యమే కారణమని తెలిసింది. సిగరెట్ తాగిన ఓ వ్యక్తి అక్కడే ఉన్న ఎండు గడ్డిలో దాన్ని ఆర్పకుండా పడేయడంతో మంటలు అంటుకుని అవి బలమైన గాలులకు అంతకంతకూ వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున కార్లు దగ్ధమయ్యాయి. కార్లతో కలిపి మొత్తం 300 వాహనాల వరకు ఈ ప్రమాదంలో దహనమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.