మహిళపై వేధింపులు.. పరారీలో ఉన్న భాజపా నేత అరెస్టు!

-

మహిళపై దాడి, వేధింపుల కేసులో భాజపా కిసాన్ మోర్చాకు చెందిన నేతగా చెప్పుకుంటోన్న శ్రీకాంత్ త్యాగిని యూపీ పోలీసులు సినీ పక్కీలో అరెస్టు చేశారు. నాలుగు రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న అతడిని మీరట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడి గురించి సమాచారం అందించిన వ్యక్తికి ముందుగా ప్రకటించిన రూ.25వేల రివార్డును అందజేస్తామని పోలీసులు తెలిపారు.

నోయిడాలోని గ్రాండ్ ఒమాక్సే సొసైటీలో నివాసముండే శ్రీకాంత్‌ త్యాగి.. అదే సొసైటీలో ఉంటే ఓ మహిళతో గొడవపడ్డాడు. కొన్ని మొక్కలు నాటేందుకు త్యాగి ప్రయత్నించగా, అది నిబంధనలకు విరుద్ధమని ఆ మహిళ వాదించగా..కోపోద్రిక్తుడైన అతడు దుర్భాషలాడుతూ, దాడికి పాల్పడ్డాడు. ఆపై త్యాగి మద్దతుదారులు ఆ నివాస ప్రాంగణంలోకి వచ్చి మహిళకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా ఆమె చిరునామా గురించి ఆరా తీశారు. దాడితోపాటు మద్దతుదారులకు సంబంధించిన పలు దృశ్యాలు వైరల్‌గా మారాయి.

ఈ గొడవ వైరల్‌ మారిన నేపథ్యంలో శ్రీకాంత్ తాను భాజపా కిసాన్‌ మోర్చా సభ్యుడినని చెప్పుకోవడంతో పాటు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా సీనియర్ నేతలతో ఉన్న ఫొటోలను పోస్టు చేశారు. కానీ పార్టీ మాత్రం ఆయన ప్రకటనలను తోసిపుచ్చింది. ఈ వివాదాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పోలీసులు, అధికారులు సోమవారం త్యాగి ఇంటికి చెందిన అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టారు. ఆయన మద్దతుదారులను అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలోనే త్యాగి పరారీలో ఉండగా.. ఆయన ఆచూకీ తెలిపిన వారికి యూపీ పోలీసులు రూ.25 వేలు రివార్డును ప్రకటించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా త్యాగి మీరట్‌లో బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసులకు తాజాగా ఉప్పందింది. అక్కడి నుంచి కూడా పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే అతడిని అరెస్టు చేశారు.

త్యాగిపై ఇప్పటికే హత్యాయత్నం, దోపిడి లాంటి 9కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడికి పలు వాహనాలు ఉన్నాయని, అందులో ఓ కారుకు ఎమ్మెల్యేలకు సంబంధించిన అసెంబ్లీ పాస్‌ కూడా ఉన్నట్లు తేలింది. త్యాగి కుంటుంబానికి నొయిడాలో దాదాపు 50 దుకాణాలు ఉన్నాయని, వాటి ద్వారా నెలకు రూ.లక్షల్లో అద్దె వస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ వీటిల్లో ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news